
పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలోని సండే మార్కెట్ వద్ద 112 డివిజన్ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడంతో బహిరంగ సభ ప్రదేశం జనసంద్రం అయింది. ఈ సభకు ముఖ్య అతిథిగా శ్రీ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు హాజరై ప్రజలకు సంక్షేమాన్ని అందించే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల కార్డు పోస్టర్ ను ఆవిష్కరించి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలను, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనేక రకాలుగా హింసించారన్నారు, ఎంఎంటీఎస్ రైలు విస్తరణలో భాగంగా గూడు కోల్పోయిన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బిహెచ్ఇఎల్, ఒడిఎఫ్, బిడిఎల్ వంటి పెద్ద పరిశ్రమలు వచ్చాయని బీఆర్ఎస్ హయాంలో ఏమి వచ్చాయని ప్రశ్నించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ రుణమాఫీ కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని, కేసీఆర్ హయాంలో ఒరగబెట్టిందేమి లేదన్నారు. రామచంద్రపురం పరిధిలో రెండు జిహెచ్ఎంసి డివిజన్లు ఉన్నప్పటికీ ఒక జిహెచ్ఎంసి కార్యాలయం కూడా లేదని, అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే రామచంద్రపురంలో జిహెచ్ఎంసి కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానన్నారు. నవంబర్ 30వ తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మీ ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాట శ్రీనివాస్ గౌడ్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈసారి పటాన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ద్వారా ప్రజలకు 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, ప్రతి మహిళకు 2500 ఇస్తామని, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణ మాఫీ చేస్తామని మరియు రేషన్ షాపులో 9 రకాల వస్తువులను అందిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల హామీలను గెలిచిన వంద రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు.
