
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలోని పరిశ్రమల నుండి కేటాయించబడిన సి.ఎస్.ఆర్ నిధులను స్థానిక గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కేటాయించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతిని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం సంగారెడ్డి లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరి క్రాంతితో ఎమ్మెల్యే జిఎంఆర్ కలిసి పలు అంశాలపై విజ్ఞాపన పత్రం అందించారు. ప్రధానంగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని జిన్నారం, గుమ్మడిదల, పటాన్ చెరు మండలాల పరిధిలో గల వందలాది పరిశ్రమలు తమ లాభాల్లో కొంత భాగాన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత(సి ఎస్ ఆర్) కి కేటాయించి, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఈ నిధులను స్థానిక అభివృద్ధికి కాకుండా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కేటాయించడం మూలంగా, పరిశ్రమలకు భూములు అందించి కాలుష్యం మూలంగా ఇబ్బంది పడుతున్న స్థానిక గ్రామాల ప్రజలు అభివృద్ధికి దూరం అవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు నెలకొల్పిన గ్రామాల పరిధిలోనే సిఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టి, బిల్లులు రాక తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నూతన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని తెలిపారు. పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.