స్వామి వివేకానంద జయంతి రోజున ఆణిముత్యాల్లాంటి సూక్తులు తెలుసుకుందాం!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: స్వామి వివేకానందుడు జీవించింది 39 ఏళ్లు! స్ఫూర్తి నింపింది 900 ఏళ్లు!! (జనవరి 12, 1863 – జూలై 4, 1902), ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా. రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు. రామకృష్ణ మఠం వ్యవస్థాపకులు.

భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండు దేశాల్లో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయము చేసిన ఖ్యాతి అతనికి ఉంది. గురువు గారి కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు. భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళీ తన ప్రాచీన ఔన్నత్యాన్ని పొందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానంద. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఇతను. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర (పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్) లో 1893 లో ప్రవేశపెట్టారు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశారు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించారు. అతను చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతని జన్మదినాన్ని “జాతీయ యువజన దినోత్సవం” గా 1984 లో ప్రకటించింది.

ఈయన ఉపన్యాసాలకు అత్యంత ప్రభావితులైన వారు చాలా మంది ఉన్నారు. వారిలో సుభాష్ చంద్ర బోస్, అరబిందో, భాగ జతిన్, మహాత్మా గాంధీ, చక్రవర్తి రాజగోపాలాచారి, జమ్సెట్జీ టాటా, నికోలా టెస్లా, సారా బెర్న్ హార్ట్ ,ఎమ్మా కాల్వె, జగదీశ్ చంద్ర బోస్

యావత్ ప్రపంచ యువతకు ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానంద గారి ముఖ్యమైన కొన్ని స్ఫూర్తి ప్రవచనాలలో కొన్ని…

1.రోజుకు ఒక్కసారైన మీతో మీరు మాట్లాడుకొండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.

  1. నీ వెనుక ఏముంది…ముందేముంది… అనేది నీకనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.
  2. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. శారీరకంగా, మేథోపరంగా, ఆధ్యాత్మికంగా బలహీనపర్చేది ఏదైనా సరే… విషంగా భావించి తిరస్కరించండి.
  3. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
  4. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే!
  5. ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి.
  6. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు.
  7. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుది మెట్టు కాదు.
  8. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతలకంటే పెద్ద బలహీనత, తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు.
  9. లేవండి ! మేల్కొండి ! గమ్యం చేరేవరకు విశ్రమించకండి.
  10. నిజాన్ని వెయ్యి మార్గాల్లో చెప్పొచ్చు. ప్రతీ ఒక్కటీ నిజమై ఉండాలి.
  11. ప్రపంచం గొప్ప వ్యాయామశాల. మనల్ని మనం దృఢంగా చేసుకోవాడానికి ఇక్కడికి వస్తుంటాం.
  12. హృదయానికి, మెదడుకు మధ్య సంఘర్షణ తలెత్తితే… మీ హృదయాన్నే అనుసరించండి.
  13. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకొండి. విజయం మీదే.
  14. మహిళా అభ్యున్నతి, ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి. అప్పుడే దేశానికి ఏదైనా మంచి జరుగుతుంది.
  15. నిజమైన చిత్తశుద్ధితో ఏ పనిలోనైనా నిమగ్నమైతే, మీరు విజయం సాధించడం తధ్యం. సర్వశక్తులనూ సంపూర్ణంగా ధారబోసి పని చేసేవారు విజయాన్ని సాధించడమే గాక అందులో లీనమైపోయి పరమ సత్యాన్నే సాక్షాత్కరించుకుంటారు. మనస్పూర్తిగా ఓ పనిని చేసే వారందరికి సహాయం భగవంతును నుండి లభిస్తుంది.
  16. ప్రతి సుఖం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైతే అంత వేగంగా సుఖదుఃఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి.
  17. సత్యాన్ని త్రికరణశుద్దిగా నమ్మితే విజయం తధ్యం. నెమ్మదిగానైనా సరే, మనం జయించి తీరుతాం.
  18. కార్యశక్తి కంటే, కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి అనంత రెట్లు ప్రభావశీలమైనది.
  19. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు. మెుత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో. నీకు కావలసిన బలం, శక్తి…. అన్నీ నీలోనే ఉన్నాయి.

21.ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే, ఏ ఆదర్శం లేని వ్యక్తి ఏభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం. కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది.

  1. విశ్వాసం, సౌశీల్యం గల ఆరుగురు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర. మనకు కావలసినవి మూడు-ప్రేమించే హృదయం, భావించే మనస్సు, పని చేసే చెయ్యి.
  2. మానవ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడని నేను గ్రహించాను. అందుకే ప్రతీ వ్యక్తి ముందు భక్తితో నిలబడతాను. వారిలో దేవుడిని చూస్తాను. ఆ క్షణంలో నేను బానిసత్వం నుంచి విముక్తి పొందుతాను. కట్టుబాట్లన్నీ మాయమవుతాయి. నేను విముక్తుడినౌతాను.

24.ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు.

25.ప్రేమతత్వాన్ని వీడవద్దు; విశ్వాసాన్ని, నమ్మకాన్ని, సడలనీయకండి. భయం విడనాడండి. భయమే పెద్ద పాపం.

26.ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు. ఘనమైన ఫలితాలు క్రమంగా సమకూరుతాయి. సాహసాన్ని ప్రదర్శించండి.

  1. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు.

28.కెరటం నాకు ఆదర్శం .. లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు.

  1. మతం అనేది సిద్దాంత రాద్దాంతాలలో లేదు .. అది ఆచరణలో ఆద్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది.
  2. ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది.

🚩ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.

🚩ఏ పనీ అల్పం కాదు. ఇష్టమైన పని లభిస్తే పరమ మూర్ఖుడు కూడా చేయగలడు. అన్ని పనులూ తనకిష్టంగా మలచుకొనేవాడే తెలివైనవాడు.

🚩ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.

🚩కళంకిత హృదయులకు ఆధ్యాత్మిక వికాసం ఉండదు.

🚩తెలివైన వారు తమ పని తామే సాధించుకోవాలి.

🚩దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు.

🚩దైవభక్తి గురుభక్తిలపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకూ నేకెవరూ అపకారం చేయలేరు.

🚩పదిమంది యువకుల్ని నాకివ్వండి. ఈ దేశ స్వరూపాన్నే మార్చేస్తాను.

🚩పిరికితనం మనిషిని నిర్వీర్యుడ్ని చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది
.

🚩విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది

🚩ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది.

🚩ప్రతి మనిషికీ వ్యక్తిత్వం ఊన్నట్లే, ప్రతి దేశానికీ, జాతికీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయనినాడు ఆ జాతి నశించిపోతుంది.

🚩నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. నిరంతరం శ్రమించేవాణ్ని చూసి ఓటమి భయపడుతుంది. మనం హీనులమని భావించుకుంటే నిజంగానే హీనులమైపోతాం.

🚩మీ కంటె ఎక్కువ తెలివి, బలం, సత్యం, జ్ఞానం ఇంకొకరికి ఉంటే కోపించి చిందులు తొక్కడం అవివేకం.

🚩విశ్వాసమే బలము, బలహీనతయే మరణము.

🚩సమాన భావం ఉన్న స్నేహమే కలకాలం నిలబడుతుంది.

🚩సముద్రం మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు.

🚩విశ్రాంతిగా కూర్చుని క్రమక్రమంగా అభివృద్ధి చెందుతాములే అని వేచిచూడకూడదు. వెంటనే ప్రారంభించాలి.

🚩తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కాని వివేకి ప్రతి పనినీ తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు.

🚩విజ్ఞానం అనేది ఒకరి నుంచి మరొకరికి చేరినపుడే దానికి విలువ. అనంత విజ్ఞానం సంపాదించినా అది నలుగురికీ పంచకపోతే నిష్ప్రయోజనం. మిణుగురు పురుగు ఉన్న కాస్త వెలుతురును, లోకానికి పంచాలని చూస్తుంది. కాబట్టి మనలో ఏ కొద్ది విజ్ఞానం ఉన్నా అది ఇతరులకు పంచినపుడే ప్రయోజనం,సార్ధకత.

🚩ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే… ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.

🚩జననం-మరణం, మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వీటి మిశ్రమాన్నే మాయ అంటారు. ఈ వలలో అనంత కాలం ఆనందం కోరుకుంటూ చరించవచ్చు.

🚩జీవితం పోరాటాల,భ్రమల పరంపర. జీవిత అంతరార్ధం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది.

🚩విద్య మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది. మనుషులను తేజోమయులను చేస్తుంది.

🚩టన్ను శాస్త్రజ్ఞానం కన్నా ఔన్స్ అనుభవం గొప్పది.

🚩డబ్బులో శక్తి లేదు. కానీ మంచితనంలో, పవిత్రతలో శక్తి ఉంటుంది.

🚩చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు.

🚩విద్య బాల్యానికి మాత్రమే పరిమితం కాదు. నాకున్న కొద్ది శక్తితో ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి.

🚩అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయరాదు. చిత్తశుద్ది, పట్టుదల, ఓర్పు ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటి కన్నా ఆవశ్యకం.

🚩స్వార్ధం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకి గొప్పనీతి. స్వార్ధంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కలిగిస్తుంది.

🚩సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు. మంచితనం మాత్రం అభిమానాన్ని,దీవెనలను తీసుకువస్తుంది.

🚩భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషించడమే విజ్ఞానం.

🚩మనిషికి వెలుగునిచ్చి మనోవికాసానికి తోడ్పడేది విద్య.

🚩మానవునికి అహంకారం తగదు,ఈ దుర్గుణాన్ని విడిచి వినయమనే సుగుణ సంపదను పెంచుకోవడం మేలు కలిగిస్తుంది. వినయం మనిషికి భూషణం వంటిది.

🚩దూరదృష్టితో ఆలోచించే ప్రతి వ్యక్తీ తప్పకుండా అపార్ధం చేసుకోబడతాడు.

🚩ఇతరులపై ఆనుకొనిన వ్యక్తీ సత్యమనే భగవంతున్ని సేవించ లేడు.

🚩పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి.

🚩నాగరికత అనే వ్యాధి ఉన్నంతవరకు పేదరికం తాండవించి తీరుతుంది. అందుకే సహాయం అవసరమై ఉంది.

🚩భారతదేశ పతనానికి కారణం ప్రాచీనులు ఏర్పాటు చేసిన శాసనాలు,సంప్రదాయాలు చెడ్డవి కావడం కాదు. సంపూర్ణ పరిశీలన పొంది సక్రమంగా సిద్ధాంతాలు కావడానికి వాటికి అవకాశం లభించకపోవడమే.

🚩మనం బయటికిపోయి మన అనుభవాలు ఇతరుల అనుభవాలతో పోల్చి చూసుకొనక పోవడం, మన చుట్టూ ఏం జరుగుతుందో గుర్తించకుండా ఉండడం, మన బుద్ది భ్రష్టమై పోవడానికి గొప్ప కారణం.

🚩ఇతర దేశాలలో ప్రగల్భలాడేవారు చాలా మంది ఉన్నారు.కాని మతానుష్ఠాన పరులైనవారు, ఆధ్యాత్మికతను తమ జీవితాల్లో చాటి చూపిన వారిని ఇక్కడే, ఈ దేశంలో మాత్రమే చూడవచ్చు.

🚩అపజయాలను లక్ష్య పెట్టకండి, అవి వాటిల్లడం సహజం, అవి జీవితానికి అందం చేకూరుస్తాయి.

🚩అపజయాలచే నిరుత్సాహం చెందకండి. ఆదర్శాన్ని చేగొని వేయిసార్లు ప్రయత్నించండి. వేయి సార్లు ఓటమి చవిచూస్తే కూడా ఇంకోసారి ప్రయత్నించండి.

🚩బలహీనతకు పరిష్కారం దానిని గురించి చింతన చెందడం కానే కాదు. బలాన్ని గురించి ఆలోచించడమే. అందుకు ప్రతిక్రియ మనుష్యులలో నిబిడీ కృతమైవున్న బలాన్ని గూర్చి వారికి బోధించండి.

🚩ఆత్మవిశ్వాసాన్ని గూర్చి నేర్చి దానిని ఆచరణలో చూపించి ఉంటే, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న అనర్ధాలు,దుఃఖాలు దాదాపు మటుమాయమై పోయేవి.

🚩మానవ చరిత్రనంతటినీ పరికిస్తే, ఘనకార్యాలు చేసిన స్త్రీ పురుషుల జీవితాల్లో అన్నింటికన్నా ఎక్కువగా సామర్ధ్యాన్ని ఇచ్చిన మూలశక్తి వారి ఆత్మ విశ్వాసమే అని తెలుస్తుంది. తాము ఘనులమనే విశ్వాసంతో వారు జన్మించారు, ఘనులే అయ్యారు.

🚩ఒక మనిషికి మరొక మనిషికీ మధ్య గల తారతమ్యం ఆత్మవిశ్వాసం ఉండడం, ఆత్మ విశ్వాసం లేకపోవడం, అనే భేదం వలన కలుగుతుందని మనం గుర్తించవచ్చు.

🚩సంకల్పన శక్తి తక్కిన శక్తులన్నిటికన్నా బలవత్తరమైనది. అది సాక్షాత్తు భగవంతుని వద్ద నుండి వచ్చేది కాబట్టి దాని ముందు తక్కినదంతా వీగిపోవలసిందే. నిర్మలం,బలిష్ఠం అయిన సంకల్పం సర్వశక్తివంతమైనవి.

🚩ఆత్మవిశ్వాసపరులైన కొందరు వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర. ఆ విశ్వాసం వ్యక్తిలోని దివ్యత్వాన్ని బహిర్గతం చేస్తుంది.

🚩స్వార్ధరాహిత్యమే విశేష లాభదాయకం. కాని దానిని అలవరచుకొనే ఓర్పు జనానికి లేదు.

🚩ఇతరులకు మేలు చేయాలనే నిరంతర ప్రయత్నంచే మనలను మనం మరచి పోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా మనలను మనము మరచిపోవడమే జీవితంలో గొప్ప గుణపాఠం.

🚩అవివేకంతో మనిషి తనను తాను ఆనందమయుణ్ణిగా చేసుకోగలనని భావిస్తాడు.కాని అనేక సంవత్సరాలు కొట్టుమిట్టాడి స్వార్ధపరతను చంపుకోవడమే నిజమైన సౌఖ్యమని తన సౌఖ్యం తన చేతిలో ఉన్నదేగాని ఇతరుల చేతుల్లో లేదని గ్రహిస్తాడు.

🚩జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకో. ప్రకృతే బలవంతముగా నీ చేత త్యాగం చేయిస్తుంది. కనుక ఇష్టపూర్వకంగానే ఇచ్చివేయి.

🚩ఏది స్వార్ధపరమో అదే అవినీతి, స్వార్ధరహితమైనదేదో అదే నీతి.

🚩పవిత్రంగా ఉంటూ ఇతరులకి మేలుచేయడమే పూజలన్నింటి సారం.

🚩దుస్థితిలో ఉన్నవారి కోసం పరితపించి సహాయానికై ఎదురు చూస్తే, అది వచ్చే తీరుతుంది.

🚩ఈ జీవితం క్షణికమైనది, లోకంలోని ఆడంబరాలు క్షణ భంగురాలు. కాని ఇతరుల నిమిత్తం జీవించే వారు మాత్రమే శాశ్వతంగా జీవిస్తారు. తక్కినవారు జీవచ్ఛవాలు.

🚩నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది. ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.

🚩నా సోదరులారా! మనం పేదలం, అనామకులం. కాని అత్యున్నత స్థితిలోని వారికి సదా అవే పరికరాలైనాయి.

🚩అసత్యం కన్నా సత్యం అనంత రెట్లు బరువైనది, మంచితనం కూడా అంతే.

🚩వ్యాకోచమే జీవనం,సంకోచమే మరణం. యావత్తు ప్రేమ వ్యాకోచం, యావత్తు స్వార్ధం సంకోచం. కనుక ప్రేమ మాత్రామే ఏకైక జీవన ధర్మం.

🚩అనేకుల హితం కోసం సర్వుల సంక్షేమం కోసమూ లోకంలోని అతి సాహసవంతులూ, సర్వోత్తములూ త్యాగం చేయాలి.

🚩అనంత ప్రేమ కరుణ గల వందల కొద్దీ బుద్దులు అవసరమై ఉన్నారు.

🚩లోకానికి కావలసింది శీలం. ఎవరి జీవితం ప్రజ్వలించే ప్రేమతో, నిస్వార్ధమయమై ఉంటుందో అలాంటివారే లోకానికి అవసరం. ఆ ప్రేమ వారు ప్రతి పదాన్ని పిడుగులా ధ్వనింప చేస్తుంది.

🚩మతం సిద్ధంతాలలోనూ, రాద్ధాంతాలలోనూ, ప్రజ్ఞావాదాలలోనూ లేదు. మతం అంటే మన స్థితి, మన పరిణతే. మతమంటే సాక్షాత్కారానుభవమే.

🚩మనుష్యుడు జన్మించినది ప్రకృతి జయించడానికి మాత్రమే కాని దానిని అనుసరించడానికి కాదు.

🚩ఈ ప్రపంచం ఒక పెద్ద గారడీశాల. మన మిచ్చటికి రావాడం మనల్ని బలిష్ఠులుగా చేసుకోవడానికే.

🚩సత్యానికై దేనినైనా సరే త్యజించవచ్చు, కానీ దేనికొరకైనా సత్యాన్ని త్యజించకూడదు.

🚩మానవుడికి మరణం లేదు, జననమూ లేదూ, దేహాలు నశిస్తాయి.కాని అతనికి మరణం లేదు.

🚩మృగత్వం, మానవత్వం, దివ్యత్వం-ఈ మూడు కలిస్తేనే మానవుడవుతాడు.

🚩గులాబి పువ్వు తన పరిమళాన్ని గుబాళించేటట్లు, నువ్వు దానం చేయి. ఇస్తున్నాననే స్పృహ లేకయే ఇవ్వటం దాని ధర్మం. లోపాలను బట్టి మానవుణ్ణి నిర్ణయించవచ్చు.

🚩ప్రకృతిని ప్రేమించు, అందాన్ని ఆస్వాదించు, మంచిని ప్రోత్సహించు, విజ్ఞానానికిచేయుతనివ్వు..

🚩పనిని సాధించడానికి సాధనలపై గురి ఏర్పరచుకోవలన్నదే నేను జీవితంలో నేర్చుకున్న అతిగొప్ప పాఠం.

🚩ఏ పరిస్థితులలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగి పోతాయి.

🚩మానసికంగా బలహీనులైనవారే తప్పులు చేస్తారు. ఈ బలహీనత అనేది వారివారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు.

🚩ధీరులు సత్యమార్గాన్ని ఎప్పుడూ తప్పరు.

🚩ముందు స్వచ్ఛంగా ఉండు, అప్పుడు అధికారం వస్తుంది.

🚩అనుభవాల క్రమమే జీవితం. అనుభవమే గురువు..

🚩అవివేకం మనల్ని మందలిస్తుంది.జ్ఞానం మనల్ని అందులోంచి విడిపిస్తుంది.

🚩నన్ను తాకవద్దు అనడం ఓ మానసిక వ్యాధి, వ్యాప్తియే జీవనం, సంకుచితమే మరణం, ప్రేమ ద్వారా అందరిని నీలో ఇముడ్చుకో.

🚩మతం ఒకరకంగా గొప్ప అనుభవమని మనం మర్చిపోకూడదు.

🚩జీవితానుభవానికి చదువు బాలికల్లో ప్రభావం చూపడం లేదనే భావన ఇప్పటికి అలానే వుంది.

🚩ఆత్మను గురించి తెలియకుండా దేవుణ్ణి గురించీ తెలుసుకోలేమని మన పురాతన గ్రంథాల భాష్యం.

🚩ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే.

🚩ఆలోచనలు జీవిస్తాయి, సుదూరం ప్రయాణం చేస్తాయి.

🚩నీ ఆశయ సాధనలో వెయ్యిసార్లు విఫలం చెందినా ప్రయత్నం విరమించకు.

🚩ప్రేమ, కోపం ఒకదాని కొకటి వ్యతిరేకం.

🚩ఐశ్వర్యానికి తమ్ముడు అహంకారం.

🚩చెడు తలచేవారు, కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు. వెలుగు చూడరు.

🚩అదృష్టవంతునికి జాగ్రత్త తోడైతే ఎడారిని కూడా స్వర్గతుల్యం చేయగలడు.

🚩గొప్ప కార్యాలెప్పుడు గొప్ప త్యాగాలవల్లే సాధించబడతాయి.

🚩ఈ లోకాన్ని ఏ ఇద్దరు ఒకే మాదిరిగా చూడరు.

🚩దానం చేయడం మన భాగ్యం. అది తెలుసుకోవడం వలనే మనం అభివృద్ది చెందుతున్నాం.

వివేకానందుడి సూక్తులు సేకరించిన వారు: రాజేందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *