కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల జాతరకు వెళ్ళండి!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: కంచికి వెళ్లలేని వారు కొడకంచికి వెళ్తే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దల ఉవాచ! సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామంలో కొలువై ఉన్నశ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయంలో మాఘ మాసం సందర్బంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 1 నుంచి 10 వ తేదీ వరకు జరుపబోతున్నట్టు ఆలయ చైర్మన్ శ్రీ అల్లాణి రామాజి రావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వార్షిక బ్రహ్మోత్సవాలను జాతరగా నిర్వహిస్తారు. 10 రోజుల పాటు జరిగే ఈ జాతరలో స్వామి వారి కళ్యాణం, గరుడ వాహన సేవ, హనుమంత సేవ, కళ్యాణం, రథోత్సవం మొదలైన సేవలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాడు రాష్ట్రంలోని కంచి క్షేత్రంలో లాగా ఇక్కడ కూడా బంగారు బల్లి, వెండి బల్లులను దర్శనం చేసుకోవచ్చు. తెలంగాణ కంచిగా పేరు గాంచిన ఈ ఆలయం అల్లాణి వంశస్థులకు పూర్వకాలం స్వామి వారు కలలో కనిపించి దగ్గరలో ఉన్న పుట్టలో తన విగ్రహం ఉన్నట్లు దర్శనం చూపించడంతో అల్లాణి వంశస్థులు ఇప్పుడున్న కొడకంచి పరిసర ప్రాంతాల్లో వెదకి స్వామి వారి విగ్రహాన్ని గుర్తించి ఆలయ నిర్మాణం చేసినట్లు చైర్మన్ శ్రీ రామాజీ రావు గారు తెలిపారు. ఫిబ్రవరి 8 వ తేదీన జరిగే స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరలో పాల్గొనడానికి భక్తులు తరలి వస్తారు. మీరు తప్పకుండ స్వామి వారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *