



ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలని రోడ్ నెంబర్ – 8 లో 2-3-2025 తేది ఆదివారం రాత్రి 8 గంటలకు 15, 13 వార్డు కౌన్సిలర్స్ శ్రీమతి కాటా సుధారాణి మరియు శ్రీమతి జి. లావణ్య శశిధర్ రెడ్డి గారికి, అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జి. శశిధర్ రెడ్డి గారికి జరిగిన ఆత్మీయ సత్కార సభ శోభాయమానంగా, కన్నుల పండుగలా ఆహ్లాదకరమైన చక్కటి వాతావరణంలో వందనపురి కాలనీవాసుల ఆధ్వర్యంలో జరిగింది. సభ ప్రారంభానికి ముందు కాలని మహిళా ప్రతినిధులు వినూత్నంగా ముఖ్య అతిథులకు ఎదురేగి వెళ్లి ఒక వైపు పూలు వెదజల్లుతుండగా, మరో వైపు బాణసంచాతో సంబరాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రయోక్త డి.ఎల్.వి. శ్రీనివాస్ గారు ముఖ్య అతిథులను సభావేదిక పైకి ఆహ్వానించారు. తదుపరి గౌరవ అతిథులు బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్ శ్రీ బి. సుధాకర్ యాదవ్ గారిని, ఆలయ బోర్డు సభ్యులు మల్లేష్ యాదవ్, లక్ష్మీకాంత్ రావు, లక్ష్మీ సాయి మెడోస్ మల్లేష్ మరియు ఇక్రిశాట్ కాలని మహేష్ గారిని వేదిక మీదికి ఆహ్వానించారు. కాలని మహిళలను పిలిచి ముఖ్య అతిథులు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, 15 వార్డు తాజా మాజీ కౌన్సిలర్ శ్రీమతి కాటా సుధారాణి గారికి, 13 వార్డు తాజా మాజీ కౌన్సిలర్ శ్రీమతి జి. లావణ్య శశిధర్ రెడ్డి గారికి శాలువాలతో సత్కారం జరిపి గజమాలను వేశారు. అమీనుపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జి. శశిధర్ రెడ్డి దంపతులను టీమ్ వందనపురి సభ్యులు శాలువాతో సత్కరించి, గజమాలను వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. బీరంగూడ గుట్ట శివాలయం ఛైర్మన్ సుధాకర్ యాదవ్ గారిని, ఆలయ కమిటీ సభ్యులను టీమ్ వందనపురి సభ్యులు శాలువాలతో సత్కరించారు. సభ ప్రారంభంలో వందనపురి కాలనీవాసులు లక్ష్మీనారాయణ యాదవ్, శ్రీధర్, ప్రభాకర్ గుప్తా, పోచాగౌడ్, వెంకటేశ్వర రావు, ప్రభావతి, జయ, అనూష, లక్ష్మి తదితరులు కౌన్సిలర్స్ కాలనీకి చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రసంగించారు. గౌరవ అతిథులు బి. సుధాకర్ యాదవ్ వందనపురి కాలని గతంలో ఎలా వుండేదో తెలుపుతూ, కొందరి పేర్లు ప్రస్తావించి కాలని అభివృద్ధికి ఎలా సహకరించారో తెలిపారు. లక్ష్మీ సాయి మెడోస్ మల్లేష్ కౌన్సిలర్స్ వార్డు పరిధిలో చేసిన వర్క్స్ గురించి తెలిపారు. శశిధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, గత అయిదు సంవత్సరాల్లో వందనపురి కాలనీలో దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. వందనపురి మెయిన్ రోడ్ నుంచి ఇసుకబాయి వరకు పెద్ద డ్రెయినేజీ లైన్స్, సిసి రోడ్, ఇసుకబాయి వాగు మీద వంతెన తదితర పనులు చేసినట్లు తెలిపారు. తాజా మాజీ కౌన్సిలర్ లావణ్య గారు మాట్లాడుతూ, 13 వార్డు పరిధిలో 100 శాతం సిసి రోడ్లు పూర్తి చేశామని తెలిపారు. మీరు ఓట్లు వేసి గెలిపించారు. మీకు పనులు చేయటమే మా బాధ్యతగా భావించి అంకిత భావంతో పని చేశామని అన్నారు. ముఖ్య అతిథి 15 వార్డు తాజా మాజీ కౌన్సిలర్ శ్రీమతి కాటా సుధారాణి గారు తమ ప్రసంగంలో కాలనీవాసుల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు. 15 వార్డు పరిధి చాలా ఎక్కువ కావడంతో మిమ్ములను అప్పుడప్పుడు కలవటానికి వీలు లేకపోయినా, మీ ప్రతినిధిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో వార్డు అభివృద్ధికి కోట్లాది నిధులు సాధించి, పనులు చేయించాము అన్నారు. నా వార్డు పరిధిలో కూడా శశిధర్ రెడ్డి గారు ముందుండి పనులు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మీరు ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు గడచిన అయిదు సంవత్సరాల కాలంలో ఎక్కువ నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన మా ఇద్దర్నీ కౌన్సిలర్స్ గా గెలిపించినందుకు, ఈ రోజు మాకు జరిగిన ఆత్మీయ సన్మాన సభలో మాకు గజమాలలతో సత్కరించిన టీమ్ వందనపురి సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిథులకు మొమెంటోలను టీమ్ వందనపురి సభ్యులు అందజేశారు. ఈ కార్యక్రమం నిర్వహించటానికి, విజయవంతం చేయటానికి కృషి చేసిన టీమ్ వందనపురి సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు. ప్రయోక్త డి.ఎల్.వి.శ్రీనివాస్ గారి వందన సమర్పణతో కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. సభ అనంతరం టీమ్ వందనపురి సభ్యులు ఏర్పాటు చేసిన విందు భోజనంలో ముఖ్య అతిథులు, అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు జరిగినప్పటికీ ఓపిగ్గా అంత సమయం వరకు ఉండి సభను విజయవంతం చేసినందుకు టీమ్ వందనపురి సభ్యులు ముఖ్య అతిథులకు, అతిథులకు, మల్లారెడ్డి కాలని, భరత్ నగర్ కాలని, ఎన్.ఆర్.ఐ. కాలని, రాజా హోమ్స్, తులసివనం, ఎస్.ఎల్.ఎన్.హోమ్స్, నల్లూరి హైట్స్, మధురా నగర్ తదితర కాలనీల ఆహ్వానితులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సభకు వచ్చిన వందనపురి కాలనీవాసులు చక్కటి అనుభూతిని ఆస్వాదించి, ఈ కార్యక్రమం ఆసాంతం గుర్తుండేలా తమ మనసుల్లో పదిలపర్చుకున్నారు.