
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రామచంద్రాపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశం అయ్యారు. మూడు డివిజన్ల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులు, నిధుల సమస్యపై ఆయనకు వివరించారు. ప్రధానంగా నూతన కాలనీలలో రహదారులు, అంతర్గత మురుగునీటి కాలువలు, పార్కుల ఏర్పాటు, వీధి దీపాలు ఏర్పాటుకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. పలు కాలనీల్లో నిధుల కొరత మూలంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తెలిపారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ కర్ణన్ త్వరలోనే నిధుల మంజూరుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.