పటాన్ చెరులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం 200 కోట్ల రూపాయల నిధుల మంజూరు – ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కార్పోరేట్ విద్యను అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కోసం 200 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను పటాన్చెరులో ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు. పాఠశాల ఏర్పాటు కోసం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 993 లో 25 ఎకరాలు కేటాయించాలని ప్రతిపాదనలు పంపించడం జరిగిందని తెలిపారు.

ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఏర్పాటు కోసం 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తూ జీవో విడుదల చేసిందని తెలిపారు.

ఆధునిక వసతులు అత్యాధునిక ప్రమాణాలతో ఏర్పాటయ్యే రెసిడెన్షియల్ స్కూల్ ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాఠశాల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *