
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ.. అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ హరివిల్లు కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో ఒక కోటి పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. విలీన గ్రామాల పరిధిలో ఏర్పడుతున్న నూతన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రధానంగా సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధిదీపాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సైతం అర్హులకు మాత్రమే అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే సత్ఫలితాలు వస్తాయని తెలిపారు. కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా సంగమేశ్వర స్వామి దేవాలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.