“పది రూపాయల నిజాయితీకి బహుమానం 13 లక్షలు” చక్కటి కథ

“పది రూపాయల నిజాయితీకి బహుమానం 13 లక్షలు” చక్కటి కథ

ఒక శావుకారి కొత్తగా కిరాణా దుకాణం పెట్టాడు. అప్పుడు ఒక పేద ఆమె వచ్చి :- “సేట్ జీ” ఇవిగో మీ పది రూపాయలు”..

సేట్ గారు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. “నేను ఎప్పుడు నీకు పది రూపాయలు ఇచ్చాను?” అన్నట్టుగా చూశాడు
ఆమె చెప్పింది :- “నిన్న సాయంత్రం నేను 70 రూపాయల సరుకు కొన్నాను. మీకు 100 రూపాయలు ఇచ్చాను. మీరు 30 రూపాయలు ఇవ్వాల్సింది పోయి నాకు పొరపాటున 40 రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఈ 10 రూపాయలు తిరిగి తీసుకోండి”.

సేట్ పది రూపాయలు గౌరవంగా తీసుకుని గల్లలో వేసి అన్నాడు :- “అమ్మా! సరుకు కొన్నప్పుడు 5 రూపాయలు తగ్గించుకోవడానికి ఎంత వాదించావు. కానీ ఇప్పుడు పది రూపాయలు తిరిగి ఇవ్వడానికి వచ్చావు?” ఎందుకు??
ఆమె నవ్వుతూ :- “ధర తగ్గించుకోవడం నా హక్కు. కానీ ఒకసారి ధర ఖరారు అయిన తర్వాత, తక్కువ ఇవ్వడం పాపం!”

సేట్ :- “నువ్వు మాత్రం పూర్తి డబ్బు ఇచ్చావు. నా తప్పు వల్లే ఈ పది రూపాయలు నీ దగ్గరకి వచ్చాయి. వాటిని ఉంచుకున్నా, నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.”
ఆమె :- “మీకు ఇబ్బంది లేకపోయినా, నా మనసుకి భారంగా ఉంటుంది. నేను తెలిసి కూడా మీ డబ్బు దాచుకున్నాననే బాధ నన్ను వెంటాడుతుంది. అందుకే రాత్రి తిరిగి ఇవ్వడానికి వచ్చాను, కానీ అప్పటికే షాపు మూసి ఉంది. అందుకే ఈరోజు వచ్చాను”.

సేట్ ఆశ్చర్యపోయి అడిగాడు :- “ఎక్కడ ఉంటారు?”
ఆమె :- “సెక్టార్ 8లో ఉంటాను”.
సేట్ షాక్ అయ్యాడు :- “7 కి.మీ. దూరం నుంచి ఈ 10 రూపాయల కోసం రెండోసారి వచ్చావా?”
ఆమె :- “అవును. నేను రేపు మా ఊరికి వెళ్లి పోతున్నాను. ఆ డబ్బులు మీకు ఇవ్వకుంటే నాకు ఎంతో భారంగా ఉటుంది. మనసుకు ఆనందం కావాలంటే ఇలాగే చేయాలి. నా భర్త లేడు. కానీ ఆయన నాకు ఒకటి నేర్పారు – ‘ఇతరుల ధనముపై ఎప్పుడు కూడా ఆశ పడకూడదు. ఎందుకంటే ఆ మనిషి ఏమి అనక పోవచ్చు కానీ పైన ఉన్న ఆ భగవంతుడు ఎప్పుడైనా లెక్క అడగవచ్చు. ఆ శిక్ష నా పిల్లలకు కూడా పడవచ్చు.”

ఇలా చెప్పి ఆమె అక్కడనుండి వెళ్లిపోయింది. సేట్ వెంటనే 300 రూపాయలు తీసుకుని, మరొక షాపుకి వెళ్లాడు. “ప్రకాశ్‌జీ, ఇవిగో మీ 300 రూపాయలు. నిన్న సరుకు కొనుగోలు సమయంలో పొరపాటున ఎక్కువగా మీరు ఇచ్చారు.”

ప్రకాశ్ నవ్వుతూ :- “మీకు తెలిసే ఉండవచ్చు, నేను తరువాత వచ్చి తీసుకునే వాడిని కదా…. ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు?”
సేట్ :- “ఎప్పుడు ఎవరిని మరణం కబళిస్తోందో ఎవరికి తెలుసు? అప్పటికి నేను చనిపోతే? నాకు మీ 300 రూపాయలు ఇవ్వాల్సి ఉన్నది అన్న విషయం మీకు తెలియదు. కానీ పైన భగవంతునికి మాత్రం లెక్క తెలుసు. ఆయన ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు?”

ఇది విని ప్రకాశ్ మనసు కదిలిపోయింది. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం అతను తన స్నేహితుని దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నాడు. కానీ మరుసటి రోజు ఆ స్నేహితుడు చనిపోయాడు. ఆ డబ్బుల విషయం ఎవరికి తెలియదు. ప్రకాశ్ ఆ డబ్బు దాచుకున్నాడు. ఇప్పుడు ఆ స్నేహితుని కుటుంబం బీదరికంలో బ్రతుకుతోందని ఎవరో చెప్పారు. ఆ మాటలు విని ప్రకాశ్ కలత చెందాడు. ” పైవాడు ఎప్పుడు లెక్క అడుగుతాడో ఎవరికి తెలుసు?”

కొన్ని రోజులు అతను చాలా భయపడ్డాడు.. చివరికి అతను ఒక మంచి ఆలోచన చేశాడు. తక్షణమే అతను బ్యాంక్‌ నుంచి 13 లక్షలు తీసి, ఆ స్నేహితుని ఇంటికి వెళ్లి అతని భార్య పాదాల దగ్గర ఆ డబ్బులు పెట్టాడు. ఆ బీద ఆమె ఇది ఎంతో పెద్ద మొత్తం ఈ డబ్బులు నాకు వద్దని చెప్పింది. కానీ అతను గతంలో జరిగిన విషయాన్ని ఆమెకు వివరించాడు. అది విన్న ఆమె కన్నీళ్లు పెట్టుకుని దీవించింది.

ఆమె ఎవరో తెలుసా..? అదే “సేట్” కి పది రూపాయలు తిరిగి ఇచ్చిన ఆమెనే..!

కష్టపడి సంపాదించిన ధనాన్ని, నిజాయితీగా సంపాదించినవారిని దేవుడు ఎప్పుడూ పరీక్షిస్తాడు. కానీ ఎప్పటికీ వదిలిపెట్టడు. ఒక రోజు తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాడు. ఆ పరమాత్ముని మీద నమ్మకం పెట్టుకోండి.

సేకరణ: ఎస్.వి. రావు, హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *