బీరంగూడ గుట్ట శివాలయం భూమి గజం ఆక్రమణకు గురైనట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధం!! – మున్సిపల్ ఛైర్మన్ టి.పి.ఆర్

అమీనుపూర్ శ్రీ బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ భూములకు సంబంధించి నిరాధార ఆరోపణలు చేయడం మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ స్థాయికి తగదని, గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అమీనుపూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఘాటుగా హెచ్చరించారు.

గురువారం ఉదయం బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్, స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిల సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో తీసుకుని వెళుతున్నామని, దేవాలయానికి సంబంధించిన భూములు అన్నింటిని సర్వే చేయించి ప్రహరీ గోడ నిర్మిస్తున్నామని తెలిపారు.

దీంతోపాటు అన్ని కుల సంఘాల విజ్ఞప్తి మేరకు గుట్టపైన స్థలాలు కేటాయించి ఫంక్షన్ హాల్స్ నిర్మించే గురుతర బాధ్యత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయని ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నిరాధార ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటు అన్నారు. దేవుడి భూములపై రాజకీయాలు చేయడం ఎవరికీ మంచిది కాదన్నారు. ప్రజల అభిమానాన్ని పొందాలంటే ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. భవిష్యత్తులోనూ ఇదే వైఖరిని కొనసాగిస్తే ప్రజలు తరిమి తరిమి కొడతారని హెచ్చరించారు.

ఈ సమావేశంలో స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *