వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లోనే ప్రజలు బయటకు రావాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని కృషి డిఫెన్స్ కాలనీలో వర్షాల మూలంగా భారీగా వరద నీరు చేరిన సమాచారం మేరకు వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం రాత్రి ఎమ్మెల్యే జిఎంఆర్ కాలనీలో పర్యటించారు. వరద నీరు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కాలనీ వాసులు భయపడాల్సిన అవసరం లేదని, అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని ధైర్యం చెప్పారు.
అనంతరం పాటి చౌరస్తాలో గల విద్యుత్ సబ్స్టేషన్ ను పరిశీలించారు. వరద నీరు ఉప్పొంగి సబ్ స్టేషన్ లోకి చేరుతోందని, విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల సూచనలకు అనుగుణంగా.. నియోజకవర్గ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.
ప్రధానంగా వరద ముంపు ఉన్న ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ, అత్యవసర బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం జరిగిందని, ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే ప్రయాణాలు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.
ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన స్థానిక పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పటాన్చెరు తహసిల్దార్ పరమేశం, సీఐ లల్లు నాయక్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, విద్యుత్ శాఖ ఏడి దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *